Garlic Potato Balls : బంగాళాదుంపలతో మనం వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో గార్లిక్ పొటాటో బాల్స్ కూడా ఒకటి. బంగాళాదుంపలు, వెల్లుల్లి కలిపి చేసే ఈ పొటాటో బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. ఈ పొటాటో బాల్స్ పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే వీటిని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ గార్లిక్ పొటాటో బాల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ పొటాటో బాల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 4, వెల్లుల్లి రెబ్బలు – 6, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, ఒరిగానో – అర టీ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి -అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, బ్రెడ్ క్రంబ్స్ – 4 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
గార్లిక్ పొటాటో బాల్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే పొట్టును తీసేసి వాటిని ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచుకుని బంగాళాదుంపల మిశ్రమంలో వేసుకోవాలి. ఇందులోనే నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ బాల్స్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేసుకోవాలి. తరువాత ముందుగా చేసుకున్న పొటాటో బాల్స్ ను వేసుకోవాలి.
నూనెలో వేయగానే వీటిని కదిలించకూడదు. ఒక నిమిషం తరువాత ఈ బాల్స్ ను అటూ ఇటూ కదిలిస్తూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా క్రిస్సీగా ఉండే గార్లిక్ పొటాటో బాల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో అప్పటికప్పుడు ఇలా బంగాళాదుంపలతో చక్కటి స్నాక్స్ ను తయారు చేసుకుని తినవచ్చు.