Goat Head Curry : మాంసాహార ప్రియులకు తలకాయ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తలకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు మన శరీరంలో ఉండే ఎముకలకు కూడా మేలు కలుగుతుంది. ఈ తలకాయ కూరను వంటరాని వారు కూడా చాలా సులభంగా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా సులభంగా చేసుకోగలిగేలా రుచిగా తలకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తలకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తలకాయ మాంసం – కిలో, ఉల్లిపాయ ముక్కలు – రెండు కప్పులు, టమాట ముక్కలు – రెండు కప్పులు, దాల్చిన చెక్క – 2ఇంచుల ముక్క, లవంగాలు – 10, యాలకులు – 5, పసుపు – టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 3 టీ స్పూన్స్ లేదా తగినంత, తరిగిన పచ్చిమిర్చి – 5, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, మిరియాలు – ఒక టీ స్పూన్, కొత్తిమీర తరుగు – అర కప్పు, నూనె – 5 టేబుల్ స్పూన్స్, ధనియాలు – 4 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు, బిర్యానీ ఆకులు – 2.
తలకాయ కూర తయారీ విధానం..
ముందుగా ధనియాలు, మిరియాలు, కొబ్బరి తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో సగం ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత నూనె, రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క మెత్తగా కాకపోతే మరి కొద్ది సేపు ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉడికించిన తలకాయ కూర వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, సంగటి వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన తలకాయ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.