Green Dosa : గ్రీన్ దోశ.. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన దోశ వెరైటీలలో ఇది కూడా ఒకటి. గ్రీన్ దోశ క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ ఒకేరకం దోశ కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. వెరైటీ రుచులు కోరుకునే వారు తప్పకుండా దీనిని ట్రై చేయాల్సిందే. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ గ్రీన్ దోశను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, మినపప్పు – ఒక కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, కొత్తిమీర – ఒక కప్పు, పుదీనా – ఒక కప్పు, కరివేపాకు- అర కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, వాము – చిటికెడు, తరిగిన ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 4, ఉప్పు – తగినంత.
గ్రీన్ దోశ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్నినీళ్లు పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెదిగిన తరువాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, ఉప్పు, వాము వేసి కలుపుకోవాలి. తరువాత పిండిని తీసుకుని వేడి వేడి పెనం మీద దోశ లాగా వేసుకోవాలి. తరువాత నూనె వేసి కాల్చుకోవాలి. ఈ దోశను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గ్రీన్ దోశ తయారవుతుంది. దీనిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ దోశను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.