Grees Peas Rice : పచ్చి బఠానీలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తినవచ్చు. పచ్చి బఠానీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే పోషకాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి బఠానీల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక చికెన్, మటన్ వంటి మాంసాహారాలను తినలేని వారు తరచూ పచ్చి బఠానీలను తినవచ్చు. ఇలా వీటితో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే పచ్చి బఠానీలను మనం కూరగా చేసుకుని తింటుంటాం. కానీ వీటితో రైస్‌ను కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. పచ్చి బఠానీలతో రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బఠానీల రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు – 1 (మీడియం సైజ్, చిన్న ముక్కలుగా కట్ చేయాలి), పచ్చి బఠానీలు – ముప్పావు కప్పు, బాస్మతి రైస్ – 1 కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – 1 టీస్పూన్, యాలకులు -2 , బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 1 అంగుళం ముక్క.
పచ్చి బఠానీల రైస్‌ను తయారు చేసే విధానం..
ఒక పాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి చక్కని సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించాలి. లైట్ బ్రౌన్ కలర్‌లోకి ఉల్లిపాయ ముక్కలు మారిన తరువాత పచ్చి బఠానీలు, బాస్మతి బియ్యం, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌ను మధ్యస్థ మంటపై పెట్టి పాన్‌పై ఒక మూతను ఉంచాలి. 12 నిమిషాల పాటు మూతను ఉంచి బాగా ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి 5 నుంచి 10 నిమిషాల పాటు మూతను అలాగే ఉంచాలి. అనంతరం మూత తీసి స్పూన్‌తో అంతా కలియబెట్టాలి. దీంతో పచ్చి బఠానీల రైస్ తయారవుతుంది. దీన్ని ఏదైనా పప్పుతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకమైన ప్రయోజనాలను, పోషకాలను పొందవచ్చు.