Gulab Jamun Ice Cream : గులాబ్ జామున్‌ల‌తో ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Gulab Jamun Ice Cream : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ఐస్ క్రీమ్స్ ను తింటూ ఉంటారు. ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డంలో ఐస్ క్రీమ్స్ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. మ‌న‌కు బేక‌రీలల్లో, షాపుల్లో ఇవి విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిల్లో గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా ఒక‌టి. దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. గులాబ్ జామున్స్ రుచితో ఈ ఐస్ క్రీమ్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఈ ఐస్ క్రీమ్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఐస్ క్రీమ్ ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చిక్క‌టి పాలు – పావు లీట‌ర్, కార్న్ ఫ్లోర్ – అర టేబుల్ స్పూన్, పాల పొడి – అర క‌ప్పు, పంచ‌దార – 2 టేబుల్ స్పూన్స్, లిక్విడ్ గ్లూకోజ్ – ఒక టేబుల్ స్పూన్, విప్డ్ క్రీమ్ – ఒక క‌ప్పు, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, మావా ఎసెన్స్ – పావు టీ స్పూన్, కండెన్స్డ్ మిల్స్ – పావు క‌ప్పు, చిన్న గులాబ్ జామున్స్ – 10.

Gulab Jamun Ice Cream recipe in telugu very tasty easy to make
Gulab Jamun Ice Cream

గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పాల‌ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో కార్న్ ఫ్లోర్, పాల‌పొడి, పంచ‌దార‌, లిక్విడ్ గ్లూకోజ్ వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ పాల‌ను స్ట‌వ్ మీద ఉంచి వేడి చేయాలి. పాలు ఒక పొంగ రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. పాలు చ‌ల్లారిన త‌రువాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసి క‌లిపి ప‌క్కకు ఉంచాలి. త‌రువాత గిన్నెలో విప్డ్ క్రీమ్ వేసి బీట‌ర్ తో 8 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో యాల‌కుల పొడి, మావా ఎసెన్స్, 5 చిన్న గులాబ్ జామున్ ల‌ను ముక్క‌లుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు విప్ట్ క్రీమ్ పై జ‌ల్లెడ‌ను ఉంచి అందులో ముందుగా త‌యారు చేసుకున్న పాల‌ను పోయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పాల‌ల్లో ఉండే గడ్డ‌లు క్రీమ్ లో ప‌డ‌కుండా ఉంటాయి. త‌రువాత మ‌రో 5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న ఐస్ క్రీమ్ ను మెట‌ల్ టిన్ లో పావు భాగం నింపాలి. త‌రువాత దీనిపై గులాబ్ జామున్ ముక్క‌ల‌ను ఉంచాలి. త‌రువాత మ‌ర‌లా ఐస్ క్రీమ్ ను వేయాలి. మ‌ర‌లా గులాబ్ జామున్ ముక్క‌ల‌ను ఉంచి ఐస్ క్రీమ్ ను వేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ ల‌ను, ఐస్ క్రీమ్ ను లేయ‌ర్స్ గా వేసుకున్న త‌రువాత దీనిపై ప్లాస్టిక్ ర్యాప్ తో క‌ప్పి 18 గంట‌ల పాటు ఫ్రీజ‌ర్ లో చాలా త‌క్కువ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉంచాలి. ఇలా ఐస్ క్రీమ్ ను ఫ్రీజ్ చేసుకున్న త‌రువాత స‌ర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ త‌యార‌వుతుంది. దీనిని చ‌ల్ల‌చ‌ల్ల‌గా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా ఇలా ఇంట్లోనే గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts