Gummadi Vadiyalu : మనం బూడిద గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో, మూత్రపిండాలను శుభ్రపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇలా అనేక విధాలుగా ఈ బూడిద గుమ్మడికాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ గుమ్మడికాయతో చాలా మంది వడియాలను తయారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మడికాయలతో చేసే ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. బూడిద గుమ్మడికాయలతో వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుమ్మడి వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
బూడిద గుమ్మడి కాయ – 1, రాళ్ల ఉప్పు – 100 గ్రా., పసుపు – 2 టీ స్పూన్స్, పచ్చిమిర్చి – 6, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినపప్పు – పావు కిలో.
గుమ్మడి వడియాల తయారీ విధానం..
ముందుగా బూడిద గుమ్మడికాయను తీసుకుని దానిపై బూడిద అంతా పోయేలా శుభ్రంగా కడగాలి. తరువాత దానిని చెక్కు, గింజలతో సహా వీలైనంత చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. తరువాత దానిపై మూత పెట్టి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ ముక్కలను చేత్తో నీళ్లు ఊరేలా బాగా నలుపుతూ కలపాలి. తరువాత ఈ ముక్కలను ఒక కాటన్ వస్త్రంలోకి తీసుకుని నీరు అంతా పోయేలా వడకట్టి మూట కట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెను బోర్లించి దానిపై ఈ మూటను ఉంచాలి. తరువాత ఈ మూటపై అడుగు వెడల్పుగా బరువుగా ఉండే వస్తువును ఉంచి రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత మినపప్పును నానబెట్టి దానిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఇలా చేసిన తరువాత మరుసటి రోజూ గుమ్మడికాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జార్ లో లేదా రోట్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి. తరువాత ముక్కలకు తగినంత మినపపిండిని కూడా వేసుకుని బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నీటితో తడిపిన కాటన్ వస్త్రం మీద లేదా ప్లాస్టిక్ కవర్ పై గుండ్రంగా వడియాల లాగా పెట్టుకోవాలి. వీటిని ఇతర వడియాల లాగా పలుచగా వత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈ వడియాలను ఒక రోజంతా బాగా ఎండిన తరువాత వస్త్రం నుండి లేదా కవర్ నుండి వేరు చేసి మరో వైపుకు తిప్పి ఎండబెట్టుకోవాలి. వీటిని రెండు నుండి మూడు రోజుల పాటు బాగా ఎండబెట్టిన తరువాత గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడియాలు ఒక సంవత్సరం పైగా నిల్వ ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న వడియాలను నూనెలో వేసి మధ్యస్థ మంటపై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ వడియాలు తయారవుతాయి. పప్పు, సాంబార్ వంటి వాటితో ఈ వడియాలను కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.