Tulsi Leaves : ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ మొక్కలను ప్రపాదించిది. అలాంటి మొక్కల్లో తులసి మొక్క ఒకటి. హిందువులు ఈ మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా తులసి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంటిల్లి పాదికి కూడా ఈ తులసి మొక్క చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. తులసి మొక్కల్లో అనేక రకాలు ఉన్నప్పటికి ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసిలో మాత్రమే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతో పవిత్రంగా పూజించే ఈ తులసి మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిపూత, నోటిలో ఇన్ఫెక్షన్, నోటి అల్సర్ వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తులసి మనకు ఉపయోగపడుతుంది. అలాగే చిన్న పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలను కూడా తులసి ఆకులను ఉపయోగించి తగ్గించవచ్చు. తులసి ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. రోజుకు ఒకటి లేదా రెండు తులసి ఆకులను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఫ్లూ, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి. లేత తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తీసుకోవడం వల్ల వివిధ రకాల జ్వరాల నుండి ఉపశమనం కలుగుతుంది.
జ్వరం మరీ ఎక్కువగా ఉంటే అర లీటర్ నీటిలో తులసి ఆకులను, యాలకుల పొడిని వేసి కషాయంలా చేసుకోవాలి. తరువాత ఈ కషాయంలో పాలు, పంచదార కలిపి టీ లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న టీ ని తాగడం వల్ల జ్వరం తీవ్రత తగ్గుతుంది. వాంతులతో ఇబ్బంది పడుతున్నప్పుడు తులసి ఆకులను, ధనియాలను, మిరియాలను సమపాళ్లల్లో తీసుకుని మెత్తగా దంచి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వాంతులు తగ్గుతాయి. ఎండిన తులసి ఆకులను ఇంట్లో పెట్టుకుంటే కీటకాలు రాకుండా ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడే వారు రోజూ 5 నుండి 6 తులసి ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 2 టీ స్పూన్ల తులసి రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది.
తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మూత్రసంబంధిత సమస్యలతో బాధపడే వారు తులసి ఆకుల కషాయంలో పాలు, చక్కెర కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. తాజా తులసి ఆకుల రసంలో, పసుపు, ఉప్పు, ఆవ నూనె కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. అంతేకాకుండా దంతాలకు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి. తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగులు తొలగిపోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ర్తహీనత సమస్య తగ్గుతుంది. తులసి ఆకులను, మిరియాలను కలిపి మెత్తగా దంచి మాత్రగా చేసుకుని తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది.
దీనితో పాటు తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది. తులసి ఆకుల కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండడం వల్ల ఉబ్బసం సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తులసి ఆకులను మెత్తగా నూరి అందులో పసుపు కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా తులసి ఆకులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.