Veg Sandwich : మనం అప్పుడప్పుడూ ఆహారంగా బ్రెడ్ ను కూడా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ తో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ తో చేసుకోదగిన వాటిల్లో వెజ్ సాండ్ విచ్ కూడా ఒకటి. వెజ్ సాండ్ విచ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. బయట దొరికే విధంగా ఉండే వెజ్ సాండ్ విచ్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ సాండ్ విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైస్ – 8, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – పావు కప్పు, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – పావు కప్పు, క్యాబేజ్ తురుము – అర కప్పు, వెజ్ మయనీస్ – పావు కప్పు, ఓరగానో – అర టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, బటర్ – కొద్దిగా.
వెజ్ సాండ్ విచ్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను, టమాట ముక్కలను, క్యాప్సికం ముక్కలను, క్యాబేజ్ తురుమును తీసుకోవాలి. తరువాత ఇందులో మయనీస్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో ఓరగానో, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడయ్యాక దానిపై బటర్ ను రాస్తూ బ్రెడ్ స్లైస్ ను రెండు వైపులా రంగు మారే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ బ్రెడ్ స్లైసెస్ ను కాల్చుకున్న తరువాత రెండు బ్రెడ్ స్లైస్ లను తీసుకుని వాటికి ఒక వైపు మయనీస్ ను రాయాలి.
మయనీస్ రాసిన వైపు లోపలికి వచ్చేలా బ్రెడ్ స్లైస్ ను అమర్చాలి. దానిపై ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి దానిపై మయనీస్ రాసిన మరో బ్రెడ్ స్లైస్ ను ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెజ్ సాండ్ విచ్ తయారవుతుంది. దీనిని మనకు కావల్సిన ఆకారంలో రెండు లేదా నాలుగు ముక్కలుగా చేసుకోవచ్చు. బ్రెడ్ ను కాల్చుకోకుండా కూడా మనం ఈ వెజ్ సాండ్ విచ్ ను తయారు చేసుకోవచ్చు. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా ఇలా వెజ్ సాండ్ విచ్ ను చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే వెజ్ సాండ్ విచ్ ను మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన సాండ్ విచ్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.