Chukkakura Pachadi : మనం ఆహారంలో భాగంగా వివిధ రకాల ఆకుకూరలను తీసుకుంటూ ఉంటాం. ఆకుకూరలను ఆహారంలో భాగంగా తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. చుక్కకూరను తీసుకోవడం వల్ల కూడా మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. చుక్కకూరలతో చేసుకోదగిన వంటకాల్లో చుక్కకూర పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని చాలా సులభంగా మనం తయారు చేసుకోవచ్చు. చుక్కకూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చుక్కకూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చుక్కకూర – 2 కట్టలు ( పెద్దవి), నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 10 లేదా తగినన్ని, నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1.
చుక్క కూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా చుక్క కూరను కాడలతో సహా చిన్న ముక్కలుగా తరగాలి. తరువాత ఈ చుక్కకూరను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నువ్వులను వేసి దోరగా వేయించి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఎండు మిర్చిని వేసి వేయించి అదే జార్ లోకి తీసుకోవాలి. తరువాత మరలా అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్రను వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తరువాత శుభ్రంగా కడిగిన చుక్కకూరను వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఒకసారి అంతా కలిపి మెత్తగా అయ్యే వరకు ఉడికించి చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి.
తరువాత జార్ లో వేసిన నువ్వులు, ఎండుమిర్చిని మెత్తని పొడిలా అయ్యే వరకు మిక్సీ పట్టి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే జార్ లో ఉడికించిన చుక్కకూరను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిని తీసుకుని అందులో నూనె వేయాలి. నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న చుక్కకూరను, నువ్వుల పొడిని, తగినంత ఉప్పును వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. చుక్కకూరను మరో 3 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. చుక్కకూరతో తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా పచ్చడిని చేసుకుని తినవచ్చు.