Honey Buying Tips : తేనె.. ప్రకృతి ప్రసాదించిన అమృతం వంటి ఆహారం తేనె అని చెప్పవచ్చు. తేనె ఎంత మధురంగా ఉంటుదో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాగే తేనె ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. నేటి తరుణంలో ఆరోగ్యంపై అవగాహన రావడంతో మనలో చాలా మంది తేనెను ఎక్కువగా వాడుతున్నారు. తీపి వంటకాల్లో, పాలల్లో పంచదారకు బదులుగా తేనెను వాడుతున్నారు. దీంతో తేనె వాడకం ఎక్కువగా పెరిగింది. దాదాపు అందరి ఇండ్లల్లో కూడా తేనె ఉంటుందని చెప్పవచ్చు. తేనె వినియోగం పెరగడంతో చాలా మంది దీనిని కల్తీ చేసి అమ్ముతున్నారు. మనలో చాలా మందికి స్వచ్ఛమైన తేనెను, కల్తీ తేనెను ఎలా గుర్తించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
కల్తీ చేసిన తేనెను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక స్వచ్చమైన తేనెను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఎక్కువగా రోడ్ల పక్కన కూడా తేనెను అమ్ముతూ ఉంటారు. తేనె తెట్టెను పెట్టుకుని పక్కన బాటిల్స్ లో తేనెను అమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మే తేనె కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పూల నుండి మకరందం దొరకని సమయంలో తేనెటీగలకు పంచదార నీటిని ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఈ నీటిని తేనెటీగలు ఆహారంగా తీసుకుని తేనెను తయారు చేసుకుంటాయి. ఇలా తయారు చేసిన తేనె పోషకాలను ఎక్కువగా కలిగి ఉండదు. ఇది కూడా అంత మంచిది కాదు. అలాగే ఇంటి వద్దకే తేనెను తెచ్చి అమ్ముతూ ఉంటారు. తేనెతెట్టను ఇంటి వద్దకే తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. ఇలా తీసుకువచ్చే తేనె కూడా సరైనది కాదు.
తేనెకు బదులుగా పంచదార పాకం, బెల్లం పాకం తయారు చేసి తేనెతెట్టలో నింపి అమ్ముతూ ఉంటారు. కనుక ఇటువంటి తేనెను కూడా వీలైనంత వరకు కొనకపోవడమే మంచిది. వీటికి బదులుగా మనకు మార్కెట్ లో లభించే వివిధ కంపెనీలకు చెందిన తేనెను కొనుక్కోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో లభించే కంపెనీల తేనె అనేక పరీక్షలు చేసి ఐఎస్ఐ మార్క్ తో మన దగ్గరకు వస్తుంది. ఈ తేనె స్వచ్చమైనదేని నిపుణులు చెబుతున్నారు. దీనిని వాడుకోవడం వల్ల ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవని వారు చెబుతున్నారు. అయితే ఈ తేనెలో ఉండే తేమ పోవడానికి తేనెను వేడి చేయడంతో పాటు దీనిలో ఫ్రిజర్వేటివ్స్, రంగులు కూడా కలిపి అమ్ముతారు. కనుక ఫ్రిజర్వేటివ్స్ మరియు వేడి చేయని తేనెను తీసుకోవడం మంచిదని వారు చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్నారని కనుక వీలైనంత వరకు మనకు నమ్మకం ఉన్నవారి దగ్గరే మంచి తేనెను తీసుకోవడమే మంచిదని వారు సూచిస్తున్నారు.