Home Tips

Honey : తేనె అసలైనదో కాదో ఎలా గుర్తించాలి..?

Honey : ప్రపంచ జనాభా రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీనికి అనుగుణంగానే ప్రజల అవసరాలు పెరుగుతున్నాయి, అందుకు కావల్సిన వనరులపై కూడా ఆ ప్రభావం పడుతోంది. ప్రధానంగా సహజ సిద్ధంగా లభించే వనరులైనా, ఆహారమైనా ఇప్పుడు వాటికి డిమాండ్ బాగా పెరిగింది. అయితే ఇదే విషయాన్ని గమనించిన వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా కృత్రిమ పద్ధతుల్లో ఉత్పత్తులను తయారు చేస్తూ వాటికి సహజ సిద్ధమైన కలరింగ్ ఇచ్చి వినియోగదారులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న వస్తువుల్లో ఏది అసలుదో, ఏది నకిలీదో తెలుసుకోవడం సాధారణ పౌరుడికి కష్టతరంగా మారింది. అయితే సహజ సిద్ధంగా లభిస్తూ, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన, ఆరోగ్య ప్రయోజనాలిచ్చే తేనె విషయంలో మాత్రం అసలుది ఏదో, నకిలీది ఏదో ఇట్టే తెలుసుకోవచ్చట. ఈ క్రమంలో అసలైన తేనె ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

తేనెటీగలు పువ్వులపై వాలి సేకరించిన మకరందాన్ని ఒక తెట్టె లాంటి పదార్థంలో నిల్వ ఉంచుతాయి. ఇలా నిల్వ ఉంచిన ద్రవమే తేనె. అయితే ఈ తేనె సహజ సిద్ధంగా తయారైనది అయితేనే మనకు కావల్సిన పోషకాలు అందడంతోపాటు దాంతో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ నేపథ్యంలో నకిలీ తేనె ఎలా ఉంటుందో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే. అయితే ఇప్పుడా భయం అవసరం లేదు. కింద ఇచ్చిన పలు పద్ధతులను పాటిస్తే అసలైన, నకిలీ తేనెలను సులభంగా గుర్తించవచ్చు. నేటి తరుణంలో నకిలీ తేనెను ఎక్కువగా తయారు చేస్తున్నారు. దీన్ని ఆయా పదార్థాలకు తీపినిచ్చే కారకంగా కలపడమే కాక, ఆహారానికి చిక్కదనాన్ని, మంచి రంగును ఇచ్చేందుకు కూడా వాడుతున్నారు.

how to identify honey is adulterated or not

నకిలీ తేనెను వాడితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మొలాసిస్, మొక్కజొన్న పిండి తదితర పదార్థాలను ఉపయోగించి నకిలీ తేనెను తయారు చేస్తారట. నకిలీ తేనెను గుర్తించడం చాలా సులభమే. కొద్దిగా తేనె తీసుకుని దానికి 2, 3 చుక్కల వెనిగర్ ఎస్సెన్స్ కలపాలి. అనంతరం వాటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా వచ్చిన మిశ్రమం ఎక్కువగా నురగను విడుదల చేస్తుంటే అది నకిలీ తేనెగా గుర్తించాలి. ఎందుకంటే నకిలీ తేనె కోసం ఉపయోగించే పదార్థాల్లో చక్కెర కూడా ఉంటుంది. ఇది వెనిగర్‌తో కలిసినప్పుడు నురగలాంటి ద్రవాన్ని ఇస్తుంది. అసలైన తేనె ఇలా నురగను ఇవ్వదు.

కొద్దిగా తేనెను తీసుకుని బొటనవేలిపై వేయాలి. అనంతరం దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తేనె బొట్టు వేలిపై చుట్టూ విస్తరిస్తే దాన్ని నకిలీ తేనెగా గుర్తించాలి. ఒక టేబుల్‌స్పూన్ తేనెను ఒక గ్లాస్ నీటిలో వేయాలి. స్వచ్ఛమైన తేనె గ్లాస్ అడుగు భాగానికి చేరుతుంది. అదే నకిలీదైతే సులభంగా నీటిలో కరుగుతుంది. ఓ అగ్గిపుల్లను తీసుకుని దాని చివరి భాగాన్ని తేనె బొట్టులో ముంచాలి. అనంతరం పరిశీలిస్తే ఆ అగ్గిపుల్ల మండాలి. దీంతో తేనె అసలైనదే అని తెలుస్తుంది. ఎందుకంటే తేనెకు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి నకిలీ తేనె మండదు.

Admin

Recent Posts