Instant Buttermilk Powder : మనలో చాలా మంది మజ్జిగను తయారు చేసుకుని ఇష్టంగా తాగుతూ ఉంటారు. మజ్జిగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరానికి చలువ చేయడంలో ఈ మజ్జిగ మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ మజ్జిగను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మజ్జిగ పొడిని తయారు చేసుకుని దానిని మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల రుచితో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మజ్జిగ పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీనితో మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ బటర్ మిల్క్ పౌడర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శొంఠి – 8 గ్రా., కడిగి తడి లేకుండా ఆరబెట్టిన కరివేపాకు – 7 రెబ్బలు, జీలకర్ర – అర కప్పు, ధనియాలు – అర కప్పు, మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, వాము – ఒక టేబుల్ స్పూన్, రాళ్ల ఉప్పు – ఒక టిన్నర టేబుల్ స్పూన్, ఇంగువ – ఒక టీ స్పూన్, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – 3 కప్పులు.
ఇన్ స్టాంట్ బటర్ మిల్క్ పౌడర్ తయారీ విధానం..
ముందుగా శొంఠిని రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. తరువాత కళాయిలో కరివేపాకు వేసి కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో జీలకర్ర, ధనియాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత ఇందులోనే వాము, మిరియాలు, దంచుకున్న శొంఠి వేసి చిన్న మంటపై దోరగా వేయించి కరివేపాకును ఉంచిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ దినుసుల్లోనే ఉప్పు, ఇంగువ వేసి కలిపి చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొడిని జల్లించాలి. జల్లించగా వచ్చిన మిగిలిన పొడిని మరలా జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని మరలా జల్లించుకోవాలి. ఇలా తయారు చేయగా వచ్చిన మెత్తటి పొడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 3 నెలల పాటు తాజాగా ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఇన్ స్టాంట్ బటర్ మిల్క్ పౌడర్ తయారవుతుంది. దీనిని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఈ పొడితో మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో ముందుగా తయారు చేసుకున్న పొడి నుండి ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసుకుని పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును ఉండలు లేకుండా చిలకాలి. తరువాత మజ్జిగ వేసి మరోసారి చిలికి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మజ్జిగ తయారవుతుంది. వేడి చేసినప్పుడు, చల్లగా, రుచిగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా ఆరోగ్యానికి మేలు చేసే మజ్జిగను తయారు చేసుకుని తాగవచ్చు. అలాగే రాత్రి పూట ఈ విధంగా మజ్జిగను తయారు చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.