Drumsticks Masala Curry : మున‌గ‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Drumsticks Masala Curry : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో మున‌క్కాయలు కూడా ఒక‌టి. మున‌క్కాయ‌లు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటితో చేసిన కూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ మున‌క్కాయ‌లల్లో జీడిప‌ప్పును వేసి మనంమ‌పాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ‌ల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా ఈ కూర‌ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మున‌క్కాయ‌ జీడిప‌ప్పు మ‌సాలా కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన మున‌క్కాయ‌లు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు – 5 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), నాన‌బెట్టిన జీడిప‌ప్పు – గుప్పెడు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్ లేదా త‌గినంత‌, నీళ్లు – అర గ్లాస్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3.

Drumsticks Masala Curry recipe in telugu how to make this
Drumsticks Masala Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – అర ఇంచు ముక్క‌, యాలకులు -2, ల‌వంగాలు – 3, గ‌స‌గ‌సాలు – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, అనాస పువ్వు – అర ముక్క‌.

మున‌క్కాయ‌ జీడిపప్పు మ‌సాలా కూర త‌యారీ విధానం..

ముందుగా జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాల‌న్నీ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్క‌ర్ లో నూనె వేసి వేడి చేయాలి, నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత నాన‌బెట్టిన జీడిప‌ప్పు, మున‌క్కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు మ‌గ్గించాలి. త‌రువాత అర గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు కుక్క‌ర్ పై మూత పెట్టి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి స్ట‌వ్ మీద ఉంచి మ‌రో నిమిషం పాటు ఉడికించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న మ‌సాలా పేస్ట్, ప‌చ్చిమిర్చి, మ‌రో పావు గ్లాస్ లేదా త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మున‌క్కాయ‌ జీడిప‌ప్పు మ‌సాలా కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు మున‌క్కాయ‌ల‌తో అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts