IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ నెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ ఎడిషన్ ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యే తేదీ మరీ దగ్గర పడుతుండడంతో ఈసారి స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతిస్తారా.. లేదా.. అన్న విషయంపై నిన్న మొన్నటి వరకు సందిగ్ధత నెలకొంది. కానీ ఎట్టకేలకు బీసీసీఐ ఈ విషయాన్ని తేల్చేసింది. ప్రేక్షకులను స్టేడియాలలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనను విడుదల చేసింది.
ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు ఈ సీజన్‌లో వారిని స్టేడియంలలోకి అనుమతించడం జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అయితే కరోనా నిబంధనల కారణంగా 25 శాతం మందికే అనుమతి ఇస్తామని తెలియజేసింది. అందువల్ల స్టేడియంలకు రావాలనుకునే ప్రేక్షకులు ఈ విషయాన్ని ముందే గమనించాలని కోరింది. స్టేడియంలలో 25 శాతం వరకే ప్రేక్షకులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇక మార్చి 26వ తేదీన గత సీజన్ విజేత చెన్నై.. రన్నరప్ కోల్‌కతా మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఈసారి కరోనా కారణంగా కేవలం నాలుగు వేదికల్లోనే లీగ్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. కాగా ఈసారి ఐపీఎల్ కోసం చాలా కఠినమైన బయో బబుల్ నిబంధనలను అమలు చేయనున్నారు. గత సీజన్‌లో టోర్నీ సగం వరకు చేరాక.. ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. తరువాత నవంబర్‌లో దుబాయ్‌లో నిర్వహించారు. ఈ క్రమంలోనే అలాంటి తప్పులు ఈసారి జరగకుండా ఉండేందుకు బీసీసీఐ పకడ్బందీ చర్యలను తీసుకుంటోంది. కఠినమైన బయో బబుల్ నియమాలను అమలు చేయనుంది.