IPL Auction 2022 : బెంగళూరులో గత రెండు రోజులుగా కొనసాగిన ఐపీఎల్ 2022 మెగా వేలం ఆదివారం ఎట్టకేలకు ముగిసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీలు పడి మరీ పలువురు ప్లేయర్లను దక్కించుకున్నాయి. అయితే రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో ఒక అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె.. సన్ రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మారన్. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్బంగా హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేస్తూ స్టాండ్స్‌లో కనిపించిన ఈమె ఇప్పుడు మెగా వేలంలో మరోమారు తళుక్కుమంది. దీంతో ఈమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కావ్య మారన్ తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ జట్టు తరఫున పాల్గొంది. ఈ క్రమంలోనే ఆమెతోపాటు జట్టు సలహాదారులు, కోచ్‌లు అయిన టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్, సైమన్ కటిచ్‌లు కూడా ఈ వేలంలో పాల్గొన్నారు. అయితే వేలం జరిగిన రెండు రోజులు కావ్య మారన్‌నే కెమెరాలు క్లిక్ మనిపించాయి. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కావ్య మారన్.. ప్రముఖ మీడియా బిజినెస్ పర్సన్ కళానిధి మారన్ కుమార్తె. ఈమె ఐపీఎల్ హైదరాబాద్ జట్టుకు కో ఓనర్‌గా ఉన్నారు. అలాగే సన్ నెట్‌వర్క్‌కు చెందిన సన్ మ్యూజిక్, ఎఫ్ఎం చానల్స్‌ను కూడా ఈమె పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ వేలం సందర్భంగా ఈమె తళుక్కుమనడంతో అందరూ ఇప్పుడు ఈమె గురించే చర్చించుకుంటున్నారు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే గడిచిన సీజన్‌లో జట్టు మరీ పేలవమైన ప్రదర్శన చేసింది. ఆడిన 14 మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్‌లలోనే జట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. తరువాత అతను జట్టులో సైతం చోటు కోల్పోయాడు. ఇక అతన్ని టీమ్ వదులుకుంది. దీంతో తాజాగా జరిగిన వేలంలో ఢిల్లీ టీమ్ అతన్ని కొనుగోలు చేసింది.
కాగా ఈ వేలానికి ముందు హైదరాబాద్ టీమ్ కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లను రిటెయిన్ చేసుకుంది. అలాగే తొలి రోజు వేలంలో ఏకంగా రూ.10.75 కోట్లను వెచ్చించి వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ నికోలాస్ పూరన్‌ను కొనుగోలు చేసింది. దీంతో అతను జట్టుకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. మరి ప్లేయర్లను మార్చింది కనుక ఈసారి టోర్నీలో అయినా హైదరాబాద్ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందా.. లేదా.. అనేది చూడాలి.