Jeera Rasam : జీల‌క‌ర్ర ర‌సం.. ఎంతో రుచిక‌రం.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది.. జీర్ణ‌శ‌క్తిని పెంచుతుంది..

Jeera Rasam : మ‌న వంటింట్లో ఉండే దినుసుల్లో జీల‌క‌ర్ర ఒక‌టి. జీల‌క‌ర్రను మ‌నం వంట‌ల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. జీల‌క‌ర్ర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించ‌డంలో, ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించ‌డంలో ఇలా అనేక విధాలుగా జీల‌క‌ర్ర మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జీల‌క‌ర్ర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ర‌సాన్ని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. రుచిగా ఉండ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి మేలు చేసే ఈ జీల‌క‌ర్ర ర‌సాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జీల‌క‌ర్ర ర‌సం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీల‌క‌ర్ర – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, కందిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 8 లేదా త‌గిన‌న్ని, త‌రిగిన ట‌మాట – 1, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నాన‌బెట్టిన చింత‌పండు – పెద్ద నిమ్మ‌కాయంత‌, నీళ్లు – 750 ఎమ్ ఎల్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్.

Jeera Rasam recipe in telugu how to make this
Jeera Rasam

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – రెండు టీ స్పూన్లు, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – రెండు టీ స్పూన్లు.

జీల‌క‌ర్ర ర‌సం త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో జీల‌క‌ర్ర‌, కందిప‌ప్పు, ఎండుమిర్చిని తీసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు, చింత‌పండు ర‌సం, ఉప్పు, ప‌సుపు, నీళ్లు పోసి క‌ల‌పాలి. తరువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి ఒక పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. ఇలా పొంగు వ‌చ్చిన త‌రువాత‌ మ‌రో 5 నిమిషాల పాటు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. త‌రువాత కొత్తిమీర వేసి అర నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ఈ తాళింపును ముందుగా త‌యారు చేసుకున్న చారులో వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే జీల‌క‌ర్ర ర‌సం త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసిన జీల‌క‌ర్ర ర‌సాన్ని ఒక్క చుక్క కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts