Kadai Mushroom : మనం పుట్టగొడుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పుట్టగొడుగులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో పుట్టగొడుగుల కూర కూడా ఒకటి. పుట్టగొడుగుల కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ పుట్టగొడుగుల కూరను విలేజీ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్టగొడుగులు – పావుకిలో, తరిగిన ఉల్లిపాయలు – 3, తరిగిన టమాటాలు – 2, ఎండుమిర్చి – 3, ధనియాలు – పావు టీ స్పూన్, మిరియాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 5, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్.
మష్రూమ్ కర్రీ తయారీ విధానం..
ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత జార్ లో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలపాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పుట్టగొడుగులు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, ఉప్పు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పుట్టగొడుగుల కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.