Kadai Paneer Curry : మనం పన్నీర్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పన్నీర్ తో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పన్నీర్ వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో కడాయి పన్నీర్ కర్రీ కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది రెస్టారెంట్ లలో రుచి చూసే ఉంటారు. ఈ కడాయి పన్నీర్ కర్రీని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. రుచిగా, తేలికగా కడాయి పన్నీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కడాయి పన్నీర్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పన్నీర్ – 200 గ్రా., పెటల్స్ లా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), పెటల్స్ లా తరిగిన క్యాప్సికం – 1 ( పెద్దది), పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు – 4, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 4, నూనె – టేబుల్ స్పూన్, యాలకులు – 4, లవంగాలు – 4, దాల్చిన చెక్క – రెండు ఇంచుల ముక్క, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు – 2 ( చిన్నవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, కసూరి మెంతి – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగినపచ్చిమిర్చి – 2.
కడాయి పన్నీర్ కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలను వేసి నెమ్మదిగా కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అదే నూనెలో పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు, యాలకులు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కలపాలి. తరువాత పావు గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలను, క్యాప్సికం ముక్కలను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో బటర్ వేసి వేడి చేయాలి. బటర్ కరిగిన తరువాత బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేడి చేయాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన ఉల్లిపాయ మరియు క్యాప్సికం ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి కలపాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత కసూరి మెంతి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కా, నాన్, బటర్ నాన్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో రెస్టారెంట్ కు వెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే కడాయి పన్నీర్ కర్రీని తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.