Kaju Barfi Recipe : డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. జీడిపప్పులో దాదాపుగా మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోమని సూచిస్తూ ఉంటారు. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. జీడిపప్పును నేరుగా తినడంతో పాటు వంటల్లోనూ వీటిని వాడుతూ ఉంటారు. అలాగే జీడిపప్పుతో చేసే కాజు బర్ఫీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. దీని రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ కాజు బర్ఫీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అలాగే సమయం కూడా ఎక్కువగా పట్టదు. కాజు బర్ఫీని రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడిపప్పు – 2 కప్పులు, పంచదార – ఒక కప్పు, నీళ్లు – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్.
కాజు బర్ఫీ తయారీ విధానం..
ముందుగా జీడిపప్పును ఒక జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బటర్ పేపర్ కు లేదా పెద్ద ప్లేట్ కు నెయ్యిని రాసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే ఒక కళాయిని తీసుకుని అందులో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. పంచదార మిశ్రమం కొద్దిగా బంకగా అయిన తరువాత యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడిని వేసి కలపాలి.
జీడిపప్పు పొడి వేసిన తరువాత మంటను చిన్నగా చేసి అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. జీడిపప్పు మిశ్రమాన్ని అడుగు భాగం మాడిపోకుండా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి. జీడిపప్పు మిశ్రమం దగ్గర పడిన తరువాత చేతికి తడి చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని ఉండకట్టి చూడాలి. ఈ మిశ్రమం ఉండకట్టడానికి రాగానే నెయ్యిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఉండకట్టడానికి రాకపోతే ఉండ వచ్చే వరకు మరికొద్ది సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద కానీ ప్లేట్ మీద కానీ వేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తరువాత చపాతీ కర్రను తీసుకుని అర ఇంచు మందంతో చపాతీలా రుద్దుకోవాలి.
ఇది పూర్తిగా చల్లారిన తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాజు బర్ఫీ తయారవుతుంది. దీనిపై సిల్వర్ లీవ్స్ ను కూడా వేసుకోవచ్చు. బయట అధిక ధరలకు కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే కాజు బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడూ జీడిపప్పుతో రుచిగా ఇలా కాజు బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు.