Vedi Cheyadam : మనలో చాలా మంది తరచూ శరీరంలో వేడి చేయడం అనే సమస్యతో బాధపడుతుంటారు. శరీరంలో వేడి చేయడం అనే సమస్య ఎక్కువగా వేసవి కాలంలో వస్తూ ఉంటుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కూడా ఈ సమస్య కొందరిని తరచూ వేధిస్తూ ఉంటుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా వేడి చేయడానికి కారణమవుతూ ఉంటాయి. శరీరంలో ఆమ్లాలు ఎక్కువైనప్పుడు కలిగే భాదల్నే మనం వేడి చేయడం అంటామని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేడి పెరిగినప్పుడు కడుపులో మంట, గొంతులో మంట, ముఖం నుండి ఆవిర్లు రావడం, కళ్లు మండడం వంటివి జరుగుతాయి.
అలాగే అరికాళ్లు, అరిచేతులు మండడం, మల మూత్రాలల్లో మంట, కడుపులో మంట, శరీరమంతా మండినట్టు ఉండడం వంటి లక్షణాలను మనం వేడి చేసినప్పుడు గమనించవచ్చు. వేడి ఎక్కువవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరంలో వేడి అధికమవ్వడం వల్ల జీవకణాలు దెబ్బతినే అవకాశం ఉంది. రక్తహీనత, వీర్యంలో జీవకణాలు నశించడం, రక్తనాళాల వ్యాధులు వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాశయం వంటి సున్నిత అవయవాలు అతి వేడి వల్ల త్వరగా దెబ్బ తినే అవకాశం ఉంది.
అధిక వేడి వల్ల కండరాలు తిమ్మిర్లు పోవడం, కండరాలు వంకర పోవడం, కండరాల్లో నులి నొప్పి రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ప్రథమ కోపం, చిరాకు, తానొక్కడే సమర్థుడనే భావం కూడా అతి వేడి ఉన్న వారిలో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఈ లక్షణాలను గమనించిన వెంటనే వేడిని తగ్గించే చర్యలు తీసుకోవడం చాలా అవసరం. శరీరంలో వేడిగా ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే చలువ చేసే పదార్థాలను తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి.
వేడి చేసే వస్తువులను తీసుకోవడం తగ్గించి శరీరాన్ని సమస్థితికి తీసుకురావడం చాలా అవసరం. పులుపు పదార్థాలను, అల్లం, వెల్లుల్లిని, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలను, ఊరగాయలను తీసుకోకూడదు. ఉదయం అల్పాహారంగా మనం తీసుకునే చాలా పదార్థాలు వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనం ఆహారంగా తీసుకునే ఇడ్లీ మనకు వేడి చేయనప్పటికి దానిని తినడానికి ఉపయోగించే కారం పొడి, అల్లం చట్నీ, శనగచట్నీ వల్ల మన శరీరంలో వేడి చేస్తుంది. తరచూ వేడి చేసినట్టయితే వారు వేడి శరీరతత్వం కలిగి ఉన్నారని అర్థం.