Kaju Chicken Curry : నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే.. కాజు చికెన్ క‌ర్రీ.. త‌యారీ ఇలా..!

Kaju Chicken Curry : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో కాజు చికెన్ క‌ర్రీ కూడా ఒక‌టి. జీడిప‌ప్పు, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌లోచాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. చ‌పాతీ, రోటీ, నాన్, బ‌ట‌ర్ నాన్ ఇలా దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ్యాచిల‌ర్స్, వంటరాని వారు, మొద‌టిసారిచేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ కాజు చికెన్ క‌ర్రీని రెస్టారెంట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 3 టేబుల్ స్పూన్స్, సాజీరా – అర టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, త‌రిగిన ఉల్లిపాయలు – 2, జీడిప‌ప్పు – గుప్పెడు, క‌సూరి మెంతి -ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kaju Chicken Curry recipe in telugu very tasty
Kaju Chicken Curry

చికెన్ మ్యారినేష‌న్ కు కావల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర‌కిలో, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

మ‌సాలా పేస్ట్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, జీల‌క‌ర్ర -అర టీ స్పూన్, ధ‌నియాలు – 3 టీ స్పూన్స్, మిరియాలు – అర టీ స్పూన్, జీడిప‌ప్పు – 10, కారం – ఒక టీ స్పూన్.

కాజు చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో చికెన్ ను తీసుకుని అందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత చికెన్ పై మూత పెట్టి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత సాజీరా వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్తబ‌డిన త‌రువాత చికెన్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత జీడిప‌ప్పు, క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత పావు క‌ప్పు నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ క‌ర్రీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts