Kandi Pachadi : మనం వంటింట్లో ఎక్కువగా పప్పు కూరలను తయారు చేయడంలో కంది పప్పును వాడుతూ ఉంటాం. కంది పప్పు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కంది పప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. కందిపప్పులో ఐరన్ తోపాటు ఫోలిక్ యాసిడ్, బి విటమిన్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడంలో, బీపీ, షుగర్ లను నియంత్రించడంలో కూడా కంది పప్పు సహాయపడుతుంది. కంది పప్పుతో వివిధ రకాల కూరగాయలను కలిపి మనం పప్పు కూరలను తయారు చేస్తూ ఉంటాం. కంది పప్పుతో పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. కంది పప్పుతో చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ కందిపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కంది పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – మూడు టేబుల్ స్పూన్స్, ఎండు మిరపకాయలు – 10, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కచ్చ పచ్చగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, నానబెట్టిన చింతపండు – 15 గ్రా., నూనె – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ.
కంది పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక కంది పప్పును వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకన్న కందిపప్పును ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఎండు మిరపకాయలను ఎక్కువగా వేయించకూడదు. ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించి పెట్టుకున్న కంది పప్పును వేసి బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
ఆ తరువాత చింతపండుతోపాటు చింతపండును నానబెట్టిన నీళ్లను కూడా పోసి మిక్సీ పట్టుకోవాలి. చివరగా కచ్చా పచ్చాగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కచ్చా పచ్చాగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కంది పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని తాళింపు కూడా చేసుకోవచ్చు. కంది పచ్చడిని నిల్వ ఉంచాలనుకునే వారు వెల్లుల్లి రెబ్బలను, తరిగిన ఉల్లిపాయలను ముక్కలను అప్పటికప్పుడు మాత్రమే కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కంది పచ్చడి, నెయ్యి వేసుకుని కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.