Brinjal Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో వంకాయలు ఒకటి. వంకాయలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో వంకాయలు ఎంతో సహాయపడతాయి. వంకాయలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారంగా చెప్పవచ్చు. వంకాయలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్లోటేట్స్ వంకాయలల్లో అధికంగా ఉంటాయి.
వంకాయలల్లో సోడియం తక్కువగా ఉంటుంది. కనుక బీపీ వ్యాధి గ్రస్తులు కూడా వంకాయలను ఆహారంగా తీసుకోవచ్చు. వంకాయలను తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వంకాయలతో మనం రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే వంటలల్లో వంకాయ ఫ్రై ఒకటి. వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే వంకాయ ఫ్రై కు బదులుగా కింద చెప్పిన విధంగా కూడా వంకాయలను ఫ్రై చేయవచ్చు. ఇలా చేసిన వంకాయ ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా వంకాయ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండు మిరపకాయలు – 7, వెల్లుల్లి రెబ్బలు – 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి -2, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 1, పసుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా చేసుకుని ఉప్పు నీళ్లలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, పొట్టు తీసుకున్న పల్లీలను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి కాగాక పసుపు, ఉప్పు, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వరకు వేగాక ముందుగా ముక్కలుగా చేసి పెట్టుకున్న వంకాయలను, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి, మధ్యస్థ మంటపై వంకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉంచుకోవాలి.
వంకాయ ముక్కలు ఉడికిన తరువాత మూత తీసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. 5 నిమిషాల తరువాత ముందుగా బరకగా మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత 2 నిమిషాల పాటు వేయించి, చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే వంకాయ ఫ్రై తయారవుతుంది. వంకాయ ఫ్రైను నేరుగా అన్నంతో లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే వంకాయలో ఉండే పోషకాలు శరీరానికి లభిస్తాయి.