Kobbari Purnam Burelu : కొబ్బరి పూర్ణం బూరెలు.. కొబ్బరి స్టఫింగ్ తో చేసే ఈ పూర్ణం బూరెలు చాలా రుచిగా ఉంటాయి. పండగలకు లేదా తీపి తినాలనిపించినప్పుడు వీటిని చాలా సులభంగా తయారు చేసి తీసుకోవచ్చు. మనం ఎక్కువగా పప్పు పూర్ణం బూరెలనే తయారు చేస్తూ ఉంటాము. కానీ కొబ్బరి స్టఫింగ్ తో చేసే ఈ బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని పచ్చి కొబ్బరి మరియు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పూర్ణం బూరెలను చక్కగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ కొబ్బరి పూర్ణం బూరెలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పూర్ణం బూరెల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, మినపప్పు – అర కప్పు, పచ్చికొబ్బరి తురుము – 3 కప్పులు, బెల్లం తురుము- ఒక కప్పు, పుట్నాల పొడి – 2 టీ స్పూన్స్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కొబ్బరి పూర్ణం బూరెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము వేసికలుపుతూ వేడి చేయాలి. బెల్లం కరిగి కొద్దిగా దగ్గర పడిన తరువాత పుట్నాల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పిండిలో ఉప్పు, వంటసోడా వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి పిండి మరీ గట్టిగా మరీ పలుచగా లేకుండా సిద్దంచేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొబ్బరి ఉండలను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై చక్కగా వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పూర్ణం బూరెలు తయారవుతాయి. ఈవిధంగా తయారు చేసిన బూరెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.