Kodigudla Pulusu : మన శరీరానికి తగినన్ని పోషకాలు లభించినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మనకు అవసరమయ్యే పోషకాలన్నింటినీ అది కూడా తక్కువ ధరలో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్డును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. అలాగే ఈ గుడ్డుతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా వంటరాని వారు కూడా సులభంగా చేసుకోవడానికి వీలుగా ఉండే కోడిగుడ్డు పులుసును రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్డు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
కోడిగుడ్లు – 4 , నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, కరివేపాకు – 2 రెబ్బలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), అల్లం వెల్లుల్ల పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – 3 (మధ్యస్థంగా ఉన్నవి), ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చింతపండు రసం – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, బెల్లం – ఒక చిన్న ముక్క.
గుడ్డు పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టుకుంటూ నూనెలో వేసి వేయించుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, కారం, పసుపు కూడా వేసి వేయించుకోవాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తరువాత టమాట ముక్కలను, ఉప్పును, కారాన్ని, ధనియాల పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత కళాయిపై మూత ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత వేయించిన గుడ్లను వేసి కలపాలి. తరువాత ఇందులో చింతపండు రసం, బెల్లం ముక్క, నీళ్లు పోసి కలపాలి. దీనిపై మరలా మూత ఉంచి 3 నుండి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే గుడ్డు పులుసు తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న గుడ్డు పులుసును అన్నంతో లేదా చపాతీతో కలిపి తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు కోడిగుడ్డులోని పోషకాలను కూడా పొందవచ్చు.