Gongura Pachadi : గోంగూర పచ్చడి.. దీనిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఒకటైన గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అందుతాయి. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుండి బయటపడవచ్చు. చాలా తక్కువ సమయంలో అయిపోయే విధంగా సులభంగా, రుచిగా గోంగూరతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గోంగూర – 2 పెద్ద కట్టలు, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, శనగ పప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత.
గోంగూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో అర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడయ్యాక గోంగూర ఆకులను వేయాలి. గోంగూర ఆకులు దగ్గర పడిన తరువాత వాటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా వేయించాలి. తరువాత ఒక జార్ లో పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో వేయించిన గోంగూరను వేసి దీనిని కూడా మరీ ముద్దగా కాకుండా కచ్చా పచ్చగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత వెల్లుల్లి రెబ్బలను, తాళింపు గింజలను, ఎండు మిర్చిని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత మిక్సీ పట్టుకున్న గోంగూరను వేసి కలుపుతూ ఉడికించాలి. పచ్చడి నుండి నూనె వేరయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. గోంగూరతో ఈ విధంగా చేసిన పచ్చడిని ఒక ముద్ద కూడా మిగల్చకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.