Kothimeera Pudina Nilva Pachadi : కొత్తిమీర, పుదీనా.. ఇవి రెండు కూడా మనకు తెలిసినవే. వంటల్లో గార్నిష్ కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని వాడడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇవి రెండు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ కొత్తిమీర, పుదీనాతో మనం విడివిడిగా పచ్చడిని తయారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఈ రెండింటిని కలిపి కూడా మనం పచ్చడిని తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎక్కువ శ్రమం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనాతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర, పుదీనా నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పెద్ద కట్ట కొత్తిమీర – 1, పెద్ద కట్ట పుదీనా – 1, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., ఆవాలు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, నూనె – పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు – గుప్పెడు, కారం – అర కప్పు, ఉప్పు – పావు కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, ఎండుమిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
కొత్తిమీర, పుదీనా పచ్చడి తయారీ విధానం..
ముందుగా కొత్తిమీరను, పుదీనాను కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత వీటిని కాటన్ వస్త్రంపై వేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఆవాలు, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆరబెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. నీరు అంతా పోయి దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి.
ఇవి చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చింతపండు రసాన్ని వేసి ఉడికించాలి. దీనిని నీరు అంతా పోయి గుజ్జు మిగిలే వరకు ఉడికించి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించుకోవాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా మిశ్రమంలో ఉడికించిన చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి, మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత నూనెతో సహా తాళింపును వేసుకోవాలి.
ఇప్పుడు ఇవి అన్నీ కలిసేలా బాగా కలపాలి. ఉప్పు, కారాన్ని కూడా చూసుకుని వేసుకోవాలి. ఈ పచ్చడిని తడి, గాలి తగలకుండా గాజు సీసాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర, పుదీనా పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నం, దోశ, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చడిని తయారు చేసుకుని ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు తినవచ్చు. ఈ పచ్చడిని తినడం వల్ల రుచితో పాటు కొత్తిమీర, పుదీనాను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.