Lemon Rice : మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో లెమన్ రైస్ కూడా ఒకటి. నిమ్మరసం వేసి చేసే ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని దాదాపు అందరూ రుచి చూసే ఉంటారు. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లలోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు ఈ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ లెమన్ రైస్ ను రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీస్పూన్స్, పల్లీలు – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, ఎండుమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – పావు టీ స్పూన్, అన్నం – ఒక కప్పు బియ్యంతో వండినంత, ఉప్పు- తగినంత, నిమ్మకాయ – 1.
లెమన్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి దోగరా వేయించాలి. పల్లీలు వేగిన తరువాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత అన్నం, ఉప్పు వేసి కలపాలి. తరువాత నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం మన రుచికి తగినంత వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.