Deva Kanchanam : మనకు రోడ్ల పక్కన, పార్కులల్లో కనిపించే అందమైన పూల మొక్కలల్లో దేవకాంచన చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు పూలు చాలా అందంగా వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు చూడడానికి గుండె ఆకారంలో ఉంటాయి. దేవకాంచన పూలతో శివున్ని కూడా పూజిస్తారు. ఈ దేవకాంచన చెట్టు పూలు, ఆకులు అందంగా ఉండడంతో పాటు వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక ఔషధాల తయారీలో ఈ మొక్కను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. దేవకాంచన చెట్టు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవకాంచన చెట్టు, ఆకులు, పూలు మనకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను మన దరి చేరకుండా చేసుకోవచ్చు.
తలనొప్పిని తగ్గించడంలో దేవకాంచన ఆకులు మనకు ఎంతో దోహదపడతాయి. ఈ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే ఈ ఆకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్,యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీని నుండి రసాన్ని తీసి గాయాలు, దెబ్బలు తగిలిన చోట రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఈ రసాన్ని మరియు ఆకుల పేస్ట్ ను చర్మ వ్యాధులు ఉన్న చోట లేపనంగా రాయాలి. ఇలా చేయడం వల్ల గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా దేవకాంచన చెట్టు బెరడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
నోటి పూత, నోటి దుర్వాసన వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయ్యే ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి పూత తగ్గుతుంది. నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలగే దేవకాంచన చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల మూత్రాశయ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. మూత్రంలో మంట, ఇన్పెక్షన్స్ తో పాటు ఇతర మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఒక గ్లాస్ నీటిలో దేవకాంచన చెట్టు బెరడు, ధనియాలు వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి పటిక బెల్లం వేసి కలిపి తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ చెట్టు బెరడును గ్లాస్ నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారిన తరువాత పటిక బెల్లం కలిపి తీసుకోవడం వల్ల హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. అదే విధంగా దేవకాంచన చెట్టు బెరడు కషాయాన్ని రోజుకు రెండు పూటలా 10 నుండి 20 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా దేవకాంచన పూలను సేకరించి ఎండబెట్టాలి. ఈ పూలకు సమానంగా పటిక బెల్లాన్ని కలిపి పొడిగా చేసుకుని నిల్వచేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది.
అలాగే దేవకాంచన చెట్టు ఆకులు, బెరడుతో చేసే కషాయాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. కనుక వీటిని ఉపయోగించడం వల్ల ఆస్థమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దేవకాంచన చెట్టు ఆకులు, బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి శరీరం అనారోగ్యాల బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి. ఈ విధంగా దేవకాంచన చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుందని దీనిని ఉపయోగించడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.