Beans Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయలల్లో బీన్స్ కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా ఇవి కూడా ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో విటమిన్ కె, విటమిన్ సిలతోపాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, జీర్ణ క్రియను మెరుగుపరచడంలో బీన్స్ ఎంతో సహాయపడతాయి.
క్యాలరీలు తక్కువగా పోషకాలు ఎక్కువగా ఉండే కూరగాయల్లో ఇవి కూడా ఒకటి. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని కూరలలోనే కాకుండా వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటి తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. బీన్స్ తో చేసే వంటకాలల్లో బీన్స్ ఫ్రై కూడా ఒకటి. బీన్స్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభమే. ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన బీన్స్ – అర కిలో, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 2, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నువ్వుల పొడి – 2 టీ స్పూన్స్, కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు, తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరవాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించి తరిగిన బీన్స్ ముక్కలను వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపై 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి బీన్స్ పూర్తిగా వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే శరీరానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.