Coconut Rice : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా పచ్చి కొబ్బరిని బెల్లంతో కలిపి తినడం లేదా దీనితో పచ్చడి చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా పచ్చి కొబ్బరితో కొబ్బరి అన్నాన్ని కూడా వండుకోవచ్చు. కొడ్డరి అన్నం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చి కొబ్బరితో కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరి పాలు – 2 కప్పులు, బియ్యం – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, మిరియాలు – ఒక టీ స్పూన్, జీడిపప్పు పలుకులు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, ఇంగువ – పావు టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు.
కొబ్బరి అన్నం తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బియ్యాన్ని తీసుకుని శుబ్రంగా కడగాలి. తరువాత అందులో కొబ్బరి పాలు, ఉప్పు, నూనె వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి అన్నాన్ని పొడి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి నెయ్యి వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత మిరియాలు, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
తరువాత ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. దీనిని మరో 3 నిమిషాల ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి అన్నం తయారవుతుంది. పచ్చి కొబ్బరిని ఉపయోగించి చేసే ఈ అన్నాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీనిని నేరుగా లేదా వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కలిపి తినవచ్చు.