Dry Amla : ప్రతి సీజన్‌లోనూ మనకు భిన్న రకాల ఆహార పదార్థాలు లభిస్తుంటాయి. ఇక చలికాలంలోనూ కొన్ని రకాల పండ్లు, ఇతర ఆహారాలు లభిస్తాయి. ఈ సీజన్ లో మనకు అధికంగా లభించే వాటిల్లో ఉసిరి కాయలు కూడా ఒకటి. చలికాలం మొత్తం ఇవి మనకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెద్ద, చిన్న అని రెండు రకాల ఉసిరికాయలు ఉంటాయి. సాధారణంగా పెద్ద ఉసిరికాయలను ఎక్కువగా వాడుతుంటారు. వీటిని పచ్చడిగా పెట్టుకుంటారు. అయితే సీజన్ దాటితే మనకు ఉసిరికాయలు కనిపించవు. కానీ ఉసిరికాయలను జ్యూస్ గా చేసి కొన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి. అయితే ఇవి నిల్వ చేసినవి. కనుక ఆరోగ్యానికి అంత మంచివి కావు. కాబట్టి ఉసిరిని నేరుగానే తీసుకోవాలి. కానీ సీజన్ దాటితే ఇవి లభించవు కదా.. మరి అలాంటప్పుడు ఏం చేయాలి..? వీటిని ఎలా తీసుకోవాలి..? అంటే.. అందుకు ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే..
మీకు మామిడికాయ ఒరుగులు తెలుసు కదా. పచ్చి మామిడి కాయలు పుల్లగా ఉన్నవి తీసుకుని వాటి లోపలి టెంక తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెడతారు. తేమ లేకుండా ఎండిన తరువాత వాటిని సేకరించాలి. వీటినే ఒరుగులు అంటారు. వీటి మాదిరిగానే ఉసిరికాయలను కూడా ఒరుగులుగా తయారు చేసుకోవచ్చు. వీటిని ఏడాది పాటు నిల్వ ఉంచుకోవచ్చు. దీంతో ఉసిరికాయలను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇక ఉసిరికాయ ఒరుగులను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి ఆరబెట్టాలి. కాయలు బాగా ఆరిన తరువాత వాటి లోపలి గింజలను తీసేయాలి. అనంతరం గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఎండలో ఎండబెట్టాలి. తేమ బాగా పోయే వరకు పూర్తిగా ఎండబెట్టాలి. అలా ఎండడంతో ఉసిరికాయ ఒరుగులు తయారవుతాయి. వాటిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. ఈ ఒరుగులను మనం ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. వీటిని కూరల్లో వేయవచ్చు. పులుపు కోసం ఈ ఒరుగులను వాడవచ్చు. అలాగే పొడి చేసి గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ కలిపి రోజూ పరగడుపునే కూడా తీసుకోవచ్చు. ఇలా ఉసిరికాయలను నిల్వ చేస్తే.. మనం ఏడాది పొడవునా వీటిని వాడుకోవచ్చు. అన్‌సీజన్‌లోనూ ఉసిరిని తీసుకోవచ్చు. బయట జ్యూస్‌లను కొని తాగాల్సిన పని ఉండదు.
ఇలా ఒరుగులను చేసి వాడినా కూడా ఉసిరికాయలను వాడిన ఫలితం ఉంటుంది. ఉసిరికాయలను తినడం వల్ల మనం ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో వీటిని తప్పక తీసుకోవాలి. దీంతో దగ్గు, జలుబు వంటివి తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. ఉసిరికాయలను చలికాలంలో తప్పక తినాలని ఆయుర్వేదం కూడా చెబుతోంది.