Egg Pulao : కోడిగుడ్ల‌తో పులావ్‌.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Egg Pulao : మ‌నం త‌ర‌చూ కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిలో ఉండే పోష‌కాలు అన్నీ ఇన్నీ కావు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్తాయి. కండ పుష్టికి, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి గుడ్లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌లో, గ‌ర్భిణీ స్త్రీల‌లో పిండం ఎదుగుద‌ల‌లో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

కోడిగుడ్ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో చేసే వంట‌కాల‌లో పులావ్ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్ల‌ పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

make Egg Pulao in this way very tasty
Egg Pulao

ఎగ్ పులావ్ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 5, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యం – 2 క‌ప్పులు, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, పుదీనా ఆకులు – అర క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – అర క‌ప్పు, త‌రిగిన ట‌మాటాలు – 2, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, నెయ్యి – 2 టీ స్పూన్స్, నీళ్లు – 3 క‌ప్పులు.

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 5, యాల‌కులు – 3, సాజీరా – అర టీ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2.

ఎగ్ పులావ్ ను త‌యారు చేసే విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో రెండు టీ స్పూన్ల నూనెను వేసి వేడ‌య్యాక ఉడికించిన ఎగ్స్ ను పావు టీ స్పూన్ ప‌సుపును, అర టీ స్పూన్ కారాన్ని, అర టీ స్పూన్ ఉప్పును వేసి వేయించాలి. ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడ‌య్యాక మ‌సాలా దినుసుల‌ను వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు కొద్దిగా రంగు మారిన త‌రువాత పచ్చి మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ప‌సుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి క‌లిపి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు ఉంచాలి. ఇప్ప‌డు ట‌మాటాల‌ను వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాట ముక్కలు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

ఇప్పుడు పుదీనా, కొత్తిమీర‌ను వేసి క‌లిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత కారం, గ‌రం మ‌సాలా, ఉప్పు, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌లపాలి. ఇప్పుడు నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి నీళ్ల‌ను మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ముందుగా నాన‌బెట్టుకున్న బియ్యాన్ని వేసి క‌లిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం 80 శాతం వ‌ర‌కు ఉడికిన తరువాత ముందుగా వేయించుకున్న కోడిగుడ్ల‌ను వేసి నెమ్మ‌దిగా క‌లిపి మూత పెట్టి పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ పులావ్ త‌యార‌వుతుంది. దీనిని నేరుగా లేదా రైతాతో క‌లిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. పులావ్ త‌యారీలో బాస్మ‌తి బియ్యానికి బ‌దులుగా సాధార‌ణ బియ్యాన్ని కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. అంతే కాకుండా ఎగ్స్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts