Kaju Biscuits : మనకు బయట స్వీట్ షాపుల్లో, బేకరీల్లో లభించే వాటిల్లో కాజు బిస్కెట్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ బిస్కెట్లను చందమామ బిస్కెట్లు అని కూడా అంటుంటారు. అచ్చం బయట లభించే విధంగా రుచిగా కరకరలాడేలా ఈ కాజు బిస్కెట్లను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కాజు బిస్కెట్లను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాజు బిస్కెట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – ఒక కప్పు, వాము – ఒక టీ స్పూన్, పంచదార – 2 లేదా 3 టీ స్పూన్స్, వంటసోడా – చిటికెడు, ఉప్పు – అర టీ స్పూన్, నెయ్యి లేదా గోరు వెచ్చని నూనె – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
కాజు బిస్కెట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకోవాలి. తరువాత నీళ్లు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ బిస్కెట్లను తయారు చేసుకోవడానికి పిండి కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు గిన్నెపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలిపి రెండు నుండి మూడు సమభాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దను తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ పావు ఇంచు మందంతో చపాతీలా రుద్దుకోవాలి.
తరువాత ఒక చిన్న బాటిల్ క్యాప్ ను తీసుకుని కాజు బిస్కెట్ల రూపంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బిస్కెట్లను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కాజు బిస్కెట్లను వేసి కాల్చుకోవాలి. ఈ బిస్కెట్లను ముందుగా చిన్న మంటపై వేయించాలి. బిస్కెట్లు వేగి పైకి తేలిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి కరకరలాడే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా కరకరలాడుతూ అచ్చం బయట లభించే విధంగా ఉండే కాజు బిస్కెట్లు తయారవుతాయి.
వీటిని నేరుగా తినవచ్చు లేదా కారం, చాట్ మసాలా చల్లుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కాజు బిస్కెట్లను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి. వీటిని మైదా పిండికి బదులుగా గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ కాజు బిస్కెట్లు చక్కగా ఉంటాయి.