Neer Dosa : మనం అల్పాహారంగా దోశలను కూడా తీసుకుంటూ ఉంటాం. దోశలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే దోశలను తయారు చేసుకోవడానికి మనం మినపప్పును అలాగే నూనెను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ నూనె, మినపప్పు కూడా లేకుండా మనం దోశలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసే దోశలను నీర్ దోశలు అంటారు. కర్ణాటక స్పెషల్ అయిన నీర్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నీర్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీ బియ్యం – ఒక కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, , ఉప్పు – తగినంత, నీళ్లు – అర లీటర్.
నీర్ దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత దానిలె తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. బియ్యం నానిన తరువాత వాటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి ముక్కలు, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర లీటర్ నీటిని పోసి పిండిని బాగా పలుచగా కలపాలి. ఇప్పుడు కళాయిని లేదా నాన్ స్టిక్ తవాను తీసుకుని వేడి చేయాలి. తరువాత దానిపై ఉల్లిపాయను రుద్దాలి. ఇప్పుడు పిండిని తగిన పరిమాణంలో తీసుకుని దోశలాగా వేసుకోవాలి. నీర్ దోశ సాధారణ దోశ లాగా ఉండదు.
ఇది చూడడానికి రవ్వ దోశ లాగా ఉంటుంది. ఈ దోశను మధ్యస్థ మంటపై కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తరువాత దానిని మరో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. దోశ కాలిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీర్ దోశ తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, టమాట చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశ పిండిని తాజాగా తయారు చేసుకోవాలి. దీనిని పులియబెట్టాల్సిన పని లేదు. నూనె లేకుండా తయారు చేసే ఈ దోశను తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.