Onion Rings : వంటింట్లో ఉల్లిపాయలు లేనిదే మనం వంట చేయలేం. మనం చేసే ప్రతి వంటలోనూ ఉల్లిపాయలను వేస్తూ ఉంటాం. ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఉల్లిపాయలలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలోనూ ఉల్లిపాయలు సహాయపడతాయి.
ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కేవలం వంటలల్లోనే కాకుండా ఉల్లిపాయలను ఉపయోగించి మనం చిరు తిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. వీటితో చేసే చిరు తిళ్లల్లో ఆనియన్ రింగ్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉటాయి. చాలా సులువుగా చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. ఆనియన్ రింగ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ రింగ్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – రెండు, మైదా పిండి – ఒక కప్పు, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, వంట సోడా – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, పెరుగు – అర కప్పు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
ఆనియన్ రింగ్స్ తయారీ విధానం..
ముందుగా ఉల్లిపాయలను గుండ్రంగా కట్ చేసి ఒక్కొక్కటిగా వేరు చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత పెరుగులో తగినన్ని నీళ్లను పోసి మజ్జిగలా చేసుకోవాలి. ఈ మజ్జిగను మైదా పిండి మిశ్రమంలో కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి కాగిన తరువాత ముందుగా గుండ్రంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ను తీసుకుని పిండిలో ముంచి నూనెలో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్స్ రింగ్స్ తయారవుతాయి. సాయంత్రం సమయాలలో ఈ విధంగా ఆనియన్ రింగ్స్ ను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు.