Paneer Curry : మనం పాలతో చేసే వాటిల్లో ఒకటైన పనీర్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పనీర్ ను తినడం వల్ల మనం పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు. పనీర్ తో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం. పనీర్ తో మనం ఎంతో రుచిగా ఉండే కూరను కూడా చేసుకోవచ్చు. హోటల్స్ లో లభించే విధంగా ఉండే పనీర్ కూరను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పనీర్ – 200 గ్రా., నూనె -3 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), జీడిపప్పు పలుకులు – 6, అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన టమాటాలు – 2 (పెద్దవి), దాల్చిన చెక్క ముక్క – 1, లవంగాలు – 4, యాలకులు – 3, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చి మిర్చి – 3, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, కారం – తగినంత, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ – కొద్దిగా.
పనీర్ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను వేసి రంగు మారే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు పూర్తిగా వేగిన తరువాత అల్లం ముక్కలను, వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించుకోవాలి. తరువాత టమాటా ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాటా ముక్కలను పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
తరువాత వాటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనెను, బటర్ ను వేయాలి. అవి వేడయ్యాక మసాలా దినుసులను వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చి మిర్చిని వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపును, కారాన్ని, ఉప్పును, ధనియాల పొడిని వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
తరువాత పనీర్ ముక్కలను, గరం మసాలాను వేసి కలిపి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను, ఫ్రెష్ క్రీమ్ ను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హోటల్ స్టైల్ పనీర్ కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.