Junnu : మనకు అప్పుడప్పుడూ జున్ను పాలు దొరుకుతూ ఉంటాయి. ఈ పాలతో మనం జున్నును తయారు చేసుకుని తింటూ ఉంటాం. జున్నును ఇష్టంగా తినే వారు చాలా మందే ఉంటారు. జున్నును తినడం వల్ల మనం అనేకరకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. జున్ను పాలతో జున్నును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జున్ను తయారీకి కావల్సిన పదార్థాలు..
జున్ను పాలు – ఒక గ్లాస్, సాధారణ పాలు – 2 లేదా 3 గ్లాసులు, బెల్లం తురుము – అర కప్పు, పంచదార – ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, యాలకుల పొడి – చిటికెడు.
జున్ను తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జున్ను పాలను పోయాలి. ఇందులోనే సాధారణ పాలను కూడా పోసి అన్నీ కలిసేలా కలపాలి. తరువాత ఇందులో బెల్లం తురుమును, పంచదారను వేసి అవి కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం, పంచదార పూర్తిగా కరిగిన తరువాత ఒక జల్లిగంటె సహాయంతో పాలను వడబోయాలి. తరువాత ఈ పాలలో మిరియాల పొడిని, యాలకుల పొడిని వేసి కలపాలి. తరువాత ఇడ్లీ కుక్కర్‌ను తీసుకుని అందులో ఒక గ్లాస్ నీటిని పోయాలి. ఆ నీటిలో ఒక చిన్న స్టాండ్‌ను ఉంచాలి. దానిపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలు ఉన్న గిన్నెను పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఒక కత్తితో గిన్నె నుండి జున్నును వేరు చేసి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా చక్కగా ఉండే జున్ను తయారువుతుంది. ఇతర పదార్థాలను ఉపయోగించి చేసే జున్ను కంటే సహజ సిద్దంగా జున్ను పాలతో చేసే జున్ను చాలా రుచిగా ఉంటుంది. ఈ జున్నును తినడం వల్ల మన శరీరానికి కూడా మేలు కలుగుతుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.