Pulihora : ఆల‌యాల్లో ల‌భించేలా రుచి రావాలంటే.. పులిహోర‌ను ఇలా చేయాలి..!

Pulihora : పులిహోర అంటే స‌హజంగానే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. చింత‌పండు, ఇంగువ‌, ప‌ల్లీలు, మిరియాలు వేసి చేసే పులిహోర అంటే ఎంతో మంది ఇష్టంగా తింటుంటారు. చాలా మంది ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు లేదా దూరాభారం వెళ్లిన‌ప్పుడు పులిహోర త‌యారు చేసుకుని దారిలో తినేందుకు పార్శిల్ క‌ట్టుకుని మ‌రీ వెళ్తుంటారు. కొంద‌రు రాత్రి పూట పులిహోరను త‌యారు చేసి ఉద‌యం తింటుంటారు. దీంతో రుచి మ‌రింత పెరుగుతుంది. అయితే ఎంత ప్ర‌య‌త్నించినా కొంద‌రు ఆల‌యాల్లో ల‌భించేలా రుచిగా పులిహోర‌ను త‌యారు చేయ‌లేక‌పోతుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే పులిహోర భ‌లే రుచిగా వ‌స్తుంది. అచ్చం గుళ్ల‌లో ల‌భించే విధంగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక ఆ విధంగా పులిహోర‌ను ఎలా త‌యారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 250 గ్రాముల బియ్యంతో వండినంత‌, చింత‌పండు గుజ్జు -30 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 5 లేదా 6, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, నువ్వులు – ఒక టీ స్పూన్.

make Pulihora in this like served in temples
Pulihora

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, శ‌న‌గ ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – అర టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర‌- ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 4, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, ఇంగువ – పావు టీ స్పూన్.

పులిహోర త‌యారీ విధానం..

ముందుగా అన్నాన్ని ఒక ప్లేట్ లో వేసి ఆరబెట్టుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత త‌రిగిన ప‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత చింత‌పండు గుజ్జును, బెల్లం తురుమును, ఉప్పును వేసి క‌లుపుతూ చింత‌పండు గుజ్జు ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో మెంతుల‌ను, ఆవాల‌ను, ధ‌నియాల‌ను, మిరియాల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత నువ్వుల‌ను వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని రోట్లో కానీ, జార్ లో కానీ వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. త‌రువాత మ‌రో క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఇప్పుడు ఆర బెట్టుకున్న అన్నంలో ఉడికించిన చింత‌పండును గుజ్జును వేసి బాగా క‌లపాలి. త‌రువాత తాళింపును, ముందుగా దంచి పెట్టుకున్న పొడిని వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పులిహోర త‌యార‌వుతుంది. త‌ర‌చూ చేసుకునే పులిహోర కంటే కూడా ఇలా త‌యారు చేసిన పులిహోర ఇంకా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల అచ్చం ఆల‌యాల్లో మాదిరిగా పులిహోర‌కు రుచి వ‌స్తుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts