Instant Rava Sweet : మనం రవ్వతో రకరకాల తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. రవ్వతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. కింద చెప్పిన విధంగా రవ్వతో చేసే ఈ తీపి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వతో స్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ రవ్వ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2 టీ స్పూన్స్, బొంబాయి రవ్వ – అర కప్పు, పాలు – ఒక కప్పు, వంటసోడా – చిటికెడు, పాలపొడి – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ స్వీట్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని జిగురుగా అయ్యే వరకు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక రవ్వ వేసి కలపాలి. దీనిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికి ముద్దలా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. రవ్వ మిశ్రమం చల్లారిన తరువాత దీనిని ప్లేట్ లోకి తీసుకుని చేత్తో బాగా కలపాలి. ఇందులోనే పాలపొడి, యాలకుల పొడి, వంటసోడా వేసి బాగా కలుపుకోవాలి.
అవసరమైతే కొద్దిగా పాలు పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న రవ్వ ఉండలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు చల్లారనిచ్చి ఆ తరువాత పంచదార పాకంలో వేసుకోవాలి. వీటిని అరగంట పాటు అలాగే ఆ తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.