Manchu Vishnu : మంచు విష్ణు, ఆయన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు విష్ణు, మోహన్‌బాబు వెంటనే నాగశ్రీనుకు క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా వారు మానవ హక్కుల సంఘానికి కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. అయితే నాగ శ్రీను, అతని గర్ల్ ఫ్రెండ్‌కు చెందిన ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనిపై నాగశ్రీను స్పందించాడు.
తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నమాట వాస్తవమేనని.. అయితే తనకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషణ పాతదని.. దాన్ని మంచు విష్ణునే బయట పెట్టించాడని ఆరోపించారు. తనకు సమస్యలు ఉన్నాయని తాను ఇంతకు ముందే సెల్ఫీ వీడియోలో చెప్పానని.. తాను ఎవరినీ మోసం చేయడం లేదని.. అన్ని విషయాలను ఇప్పటికే చెప్పానని.. కానీ తనను ఇంకా ఇరికించేందుకే మంచు విష్ణు ఆ ఆడియో టేప్‌ను బయట పెట్టించాడని అన్నాడు.
తన గర్ల్ ఫ్రెండ్ ఒక దళిత అమ్మాయి అని.. ఆమెకు, ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధం లేదని.. కావాలనే మంచు విష్ణు తన పాత కాల్ రికార్డులను బయట పెట్టిస్తున్నాడని నాగశ్రీను అన్నాడు. మంచు విష్ణు ఈ విధంగా చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని.. ఆమె రేపు బయట ఎలా తలెత్తుకుని తిరుగుతుందని నాగ శ్రీను అన్నాడు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు మంచు విష్ణు, మోహన్ బాబు మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలోనే ఈ విషయం మానవ హక్కుల సంఘం వద్దకు చేరింది. వారు దీనిపై ఏమని స్పందిస్తారో చూడాలి.