Masala Perugu Kura : మసాలా పెరుగు కూర.. కేవలం పెరుగుతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈకూరను తయారు చేయడం చాలా తేలిక. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ సమయంలో ఈకూరను తయారు చేసి తీసుకోవచ్చు. ఎవరైనా చాలా సులభంగా ఈ కూరను తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ పెరుగు కూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా పెరుగు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలికిన కమ్మటి పెరుగు – ఒక కప్పు, నూనె – 2టేబుల్ స్పూన్స్, పొడుగ్గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, బిర్యానీ ఆకు – 1, లవంగాలు – 3, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, శనగపిండి – 2 టీ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా పెరుగు కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, శనగపిండి వేసి వేయించాలి. తరువాత పెరుగు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించి ఆ తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా పెరుగు కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా, రుచిగా పెరుగుతో కూరను తయారు చేసి తీసుకోవచ్చు.