Blood Thinner Foods : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్తం కూడా పలుచగా ఉండాలి. రక్తం పలుచగా ఉంటేనే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ మనలో చాలా మందిలో రక్తం చిక్కగా ఉంటుంది. దీంతో చాలా మంది గుండెపోటుతో పాటు వివిధ రకాల గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు రాకుండా రక్తం పలుచగా మారడానికి వైద్యులు రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడుతూ ఉంటారు. ఈ మందులను వాడడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. అయితే మందులకు బదులుగా రక్తాన్ని పలుచగా చేసే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల రక్తం పలుచగా మారడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
రక్తాన్ని పలుచగా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తాన్ని పలుచగా చేయడంలో మనకు సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తం ఎక్కువగా గడ్డకట్టకుండా నిరోధించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ప్లేట్ లెట్ లక్షణాలను కలిగి ఉండే పసుపును వాడడం వల్ల కూడా రక్తం పలుచగా మారుతుంది. మన ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవడం వల్ల కూడా రక్తం పలుచగా మారుతుంది. అల్లంలో సాలిసైలేట్, ఆస్పిరిన్ లాంటి రక్తాన్ని పలుచబరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేయడంలో ప్రభావవంతమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అదే విధంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కి కూడా యాంటీ ప్లేట్ లెట్ లక్షణాలు ఉంటాయి. రక్తాన్ని పలుచగా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి. అలాగే బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఇవి ప్లేట్ లెట్ అగ్రిగేషన్ ను తగ్గించి రక్తనాళాల మృదుత్వాన్ని పెంచే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇక డార్కె చాక్లెట్స్ కూడా రక్తాన్ని పలుచగా చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆలివ్ నూనెను వాడడం వల్ల కూడా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆలివ్ నూనెలో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు,పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలతో పాటు ప్రతిస్కందక లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే ఇప్పటికే రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడే వారు వైద్యులను సంప్రదించి ఈ ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల సహజసిద్దంగా రక్తం పలుచగా మారడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.