మెత్త‌గా పొంగుతూ వచ్చేలా మ‌సాలా పూరీల‌ను ఇలా చేయండి.. ఆలు క‌ర్రీతో తింటే బాగుంటాయి..!

మ‌నం ఉద‌యం పూట అల్పాహారంగా చేసే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు. పూరీల‌ను కూడా మ‌నం త‌రుచూ వంటింట్లో త‌యారు చేస్తూనే ఉంటాము. అయితే త‌రుచూ ఒకేర‌కం పూరీలు కాకుండా కింద చెప్పిన విధంగా వెరైటీగా మసాలా పూరీల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పూరీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా మ‌సాలా పూరీల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. చ‌క్క‌గా పొంగుతూ నూనె పీల్చ‌ని ఈ మ‌సాలా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా పూరీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కార్న్ ఫ్లోర్ – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, గోధుమ‌పిండి -ఒక క‌ప్పు, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – కొద్దిగా, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉడికించి మెత్త‌గా చేసుకున్న‌ బంగాళాదుంప‌లు – 3, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

masala puri very easy method to make them

మ‌సాలా పూరీ త‌యారీ విధానం..

ముందుగా గిన్నెలో కార్న్ ఫ్లోర్, గోధుమ‌పిండి, ఉప్పు వేసిక‌ల‌పాలి. త‌రువాత నూనె త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసి క‌ల‌పాలి. చివ‌ర‌గా ఒక టీ స్పూన్ నూనె వేసిక‌ల‌పాలి. త‌రువాత కొద్ది కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ పిండిని క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు పిండిని నాన‌బెట్టాలి. త‌రువాత పిండిని మ‌రోసారి అంతా క‌లిసేలా క‌లుపుకుని ఉండలుగా చేసుకోవాలి. త‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని నూనె లేదా పొడి పిండి వేసుకుంటూ మ‌రీ ప‌లుచ‌గా, మ‌రీ మందంగా కాకుండా వ‌త్తుకోవాలి. ఇలా అన్నింటిని వ‌త్తుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పూరీల‌ను వేసి ముందుగా గంటెతో లోప‌లికి వ‌త్తాలి. పూరీ పొంగిన త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా పూరీ త‌యార‌వుతుంది. దీనిని పూరీ క‌ర్రీ, ఆలూ క‌ర్రీతో తింటే చాలా రుచిగాఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన మ‌సాలా పూరీల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts