Pulusu Pindi : పులుసు పిండి.. బియ్యంతో చేసే పాతకాలపు అల్పాహారాల్లో ఇది కూడా ఒకటి. పులుసు పిండి చూడడానికి ఉప్మాలా, కారం, పుల్ల పుల్లగా చాలా రుచిగాఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ ఒకేరకం అల్పాహారాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పాలకాలపు వంటకమైనా ఈ పులుసు పిండిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పులుసు పిండి తయారీకి కావల్సిన పదార్థాలు..
2 గంటల పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, చింతపండు -చిన్న నిమ్మకాయంత, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, ఉప్పు – తగినంత, బెల్లం – ఒక చిన్న ముక్క, ఎండుమిర్చి – 4 లేదా 5, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు – కొద్దిగా, ఆవాలు – ఒక టీస్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, నీళ్లు – ఒక కప్పు.
పులుసు పిండి తయారీ విధానం..
ముందుగా చింతపండును ఒక కప్పు నీటిలో నానబెట్టాలి. తరువాత జార్ లో బియ్యం, పచ్చి కొబ్బరి, ఉప్పు, బెల్లం, ఎండుమిర్చి వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న బియ్యం, చింతపండు రసం, నీళ్లు వేసి కలపాలి. దీనిని కలుపుతూ నీరంతా ఆవిరి అయిపోయే వరకు ఉడికించాలి. తరువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి పొడి పొడిగా ఉప్మాలా విడివిడిగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులుసు పిండి తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా చట్నీతో తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పులుసు పిండిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.