Masala Shanagalu : మనం కాబూలీ శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఈ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటితో వివిధ రకాల కూరలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. కూరలతో పాటు ఈ కాబూలీ శనగలతో మనం మసాలా శనగలను కూడా తయారు చేసుకోవచ్చు. సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా శనగలతో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా మసాలా శనగలను తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ మసాలా శనగలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా శనగల తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన కాబూలీ శనగలు – ఒక కప్పు, నీళ్లు – అర లీటర్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పొడవుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, ఎండుమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్.
మసాలా శనగల తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో శనగలను తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు, ఉప్పు వేసి మూత పెట్టాలి. వీటిని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత శనగలను వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రంగు మారే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. వీటిని చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ఉడికించిన శనగలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా శనగలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.