Minapa Garelu : మినపప్పును కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మినపప్పు కూడా ఇతర పప్పు దినుసుల వల్లె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఎక్కువగా అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. మినపప్పుతో చేసుకోదగిన వంటకాల్లో మినపగారెలు కూడా ఒకటి. మినప గారెలను మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనం తరచూ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. మినప గారెలు పొంగడానికి మనం సోడా ఉప్పు వేస్తూ ఉంటాం. సోడా ఉప్పు వేయకుండా కూడా మినప గారెలు పొంగేలా మనం తయారు చేసుకోవచ్చు. సోడా ఉప్పు వాడకుండా మినపగారెలను రుచిగా, పొంగేలా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మినపగారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపగుళ్లు – పావు కిలో, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లే తరుగు – 2 టీ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
మినప గారెల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకోవాలి. తరువాత వాటిని రెండు సార్లు నీటితో బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 2 నుండి 3 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. తరువాత నీటిని వడకట్టి పప్పును జార్ లో మిక్సీ పట్టుకోవాలి. తరువాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చేత్తో లేదా విస్కర్ తో పిండిని ఒక దిశలో 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సోడా ఉప్పు వేయకుండానే గారెలు చక్కగా పొంగుతాయి. ఇప్పుడు ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి ముందుగా కలిపిన దిశలోనే అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుని తగినంత పిండిని తీసుకుని అరటి ఆకు మీద లేదా ప్లాస్టిక్ కవర్ మీద ఉంచాలి. తరువాత దీనిని గారె ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఇలా వత్తుకోవడం రాని వారు స్టీల్ టీ గంటెను తీసుకుని దానికి కింది వైపు తడి చేయాలి. తరువాత దానిపై పిండిని ఉంచి మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేసుకోవాలి. తరువాత ఈ గారెలను కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ కదుపుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మినప గారెలు తయారవుతాయి. ఉదయం పూట అల్పాహారంగా లేదా స్నాక్స్ గా అలాగే పండుగలకు ఇలా మినప గారెలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.