Mixed Vegetable Curry : అన్నంతోపాటు మనం తరచూ చపాతీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా కేవలం చపాతీలను మాత్రమే తింటుంటారు. అయితే చపాతీల్లోకి ఏం కూర తిందామా.. అని ఆలోచిస్తుంటారు. కానీ చపాతీల్లోకి అన్ని కూరగాయలు కలిపి చేసే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అన్ని కూరగాయల్లోని పోషకాలను మనం ఒకేసారి పొందవచ్చు. దీంతో ఎంతో లాభం కలుగుతుంది. ఇక చపాతీల్లోకి ఎంతో రుచిగా ఉండే మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిలగడదుంపలు – 2, టమాటాలు – 2, క్యారెట్లు – 2, కాలిఫ్లవర్ – 1 (చిన్నది), తెల్ల శనగలు – పావు కప్పు, ఉల్లిపాయ – 1, కొబ్బరిపాలు – ఒక కప్పు, టమాటా గుజ్జు – 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు – 4 (పేస్ట్‌లా చేయాలి), అల్లం – 2 ఇంచుల ముక్క (సన్నగా తురమాలి), ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒకటిన్నర టీస్పూన్లు, కారం – 1 టీస్పూన్, మిరియాల పొడి – 1 టీస్పూన్, దాల్చిన చెక్క – అంగుళం ముక్క, ఉప్పు – తగినంత, నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, నూనె – 2 టేబుల్ స్పూన్లు.
మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీని తయారు చేసే విధానం..
శనగలను నానబెట్టాలి. చిలగడదుంపలు, టమాటాలు, క్యారెట్లు, కాలిఫ్లవర్ ముక్కలు, నానబెట్టిన శనగలను ప్రెషర్ కుక్కర్‌లో లేదా మందపాటి గిన్నెలో వేసి ఉడికించి దించాలి. నాన్ స్టిక్ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం తురుము, వెల్లుల్లి ముద్ద వేసి వేగాక టమాటా గుజ్జు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి ఒక నిమిషం వేగనిచ్చి ఉడికించిన కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి సిమ్‌లో ఉడికించాలి. గ్రేవీ ముక్కలకు పట్టాక చివరగా నిమ్మరసం, కొత్తిమీర తురుమూ చల్లి ఉప్పు సరి చూసి దించాలి. దీంతో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. ఎందులో అయినా సరే తినవచ్చు. దీని వల్ల మనకు అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. అందరికీ ఎంతగానో నచ్చుతుంది.