Mullangi Pachadi : ముల్లంగిని తిన‌లేరా.. అయితే ఇలా చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..!

Mullangi Pachadi : మ‌నం దుంప జాతికి చెందిన వాటిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో ముల్లంగి కూడా ఒక‌టి. వీటి వాస‌న, రుచి కార‌ణంగా చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ముల్లంగి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కామెర్ల వ్యాధిని న‌యం చేయ‌డంలో, మూత్రాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలో ముల్లంగి ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముల్లంగిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్సర్ బారిన ప‌డే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో కూడా ముల్లంగి తోడ్ప‌డుతుంది. క‌నుక ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Mullangi Pachadi is very tasty if you make like this
Mullangi Pachadi

ముల్లంగితో కూర‌ల‌ను, ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటితో చేసే కూర‌లు, ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా ముల్లంగితో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ముల్లంగి ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

స‌న్న‌గా త‌రిగిన ముల్లంగి – 3 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చి మిర్చి – 7 లేదా 8, చింత‌పండు – 20 గ్రా., జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, ఉప్పు – త‌గినంత‌, నూనె – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఎండు మిర్చి – 2, శ‌న‌గ ప‌ప్పు – అర టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

ముల్లంగి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత ప‌చ్చి మిర్చిని, జీల‌క‌ర్ర ను వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత ముల్లంగి ముక్క‌ల‌ను, ఉప్పును, ప‌సుపును వేసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ముల్లంగి ముక్క‌లు చ‌ల్ల‌గా అయిన త‌రువాత జార్ లో వేసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, చింత‌పండును వేసి మ‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా క‌చ్చా ప‌చ్చాగా ఉండేలా మిక్సీ ప‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును మిక్సీ ప‌ట్టుకున్న ముల్లంగి మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ముల్లంగి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ముల్లంగి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts