Meal Maker Spinach Curry : మనం తరచూ ఆహారంలో భాగంగా పాలకూరను తీసుకుంటూ ఉంటాం. శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు పాలకూరలో ఉంటాయి. పాలకూరను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పాలకూరతో మనం వివిధ రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఈ పాలకూరలో మీల్ మేకర్ లను వేసి కూడా మనం కూరను తయారు చేయవచ్చు. మీల్ మేకర్ లు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రెండింటినీ కలిపి కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పాలకూర కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 1 పెద్ద కట్ట, మీల్ మేకర్ – ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు – 3, తరిగిన పచ్చి మిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – తగినంత, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని.
మీల్ మేకర్ పాలకూర కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను వేడి నీళ్లలో వేసి 3 నిమిషాల పాటు ఉంచి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచాలి.
టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత తరిగిన పాలకూరను వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మీల్ మేకర్ లను, గరం మసాలాను, తగినన్ని నీళ్లను పోసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పాలకూర కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా పాలకూర, మీల్ మేకర్ లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.